||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- ముప్పది మూడవ సర్గ ||

||భార్యా రామస్య ధీమతః !||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ త్రయస్త్రింశస్సర్గః

తత్త్వదీపిక
"భార్యా రామస్య ధీమతః"

ముప్పది మూడవ సర్గలో చలించిన మనస్సు గల సీత,
బ్రహ్మ ఇంద్రాది దేవతలకు నమస్కరిస్తూ,
హనుమంతుడు వినిపించిన రామకథ సత్యమే అగుగాక అని ప్రార్థిస్తుంది.

"నమోsస్తు వాచస్పతయే సవజ్రిణే
స్వయంభువే చైవ హుతాశనాయచ|
అనేన చోక్తం యదిదం మమాగ్రతో
వనౌకసా తచ్చ తథాస్తు నాన్యథా" ||33-14||

ఎందుకు ఈ ప్రార్థన ?
ఆ హనుమ పాడిన రామకథ ప్రకారము
రాముడు సీతాన్వేషణలో మునిగి ,
కొత్త స్నేహితులను సంపాదించినట్లు,
కొత్త స్నేహితుల సహాయముతో వేలకొలదీ వానరులు
ఆన్ని దిశలలో సీతాన్వేషణకోసము పంపిబడినట్లు తెలుస్తుంది.
అది సత్యమే అయితే సీతను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నమాట.
అదే సీతకి కావలసినది.
అందుకే "ఆ వానరుడు చెప్పిన మాటలు నిజమగుగాక",
అని సీతమ్మ ప్రార్థిస్తుంది.

హనుమంతుడు సీత మనస్సు స్పందిస్తునట్లు గ్రహించి,
ఆ వృక్షమునుంచి దిగి సీతాదేవిని సమీపించి నమస్కరించెను.
ఆ హనుమంతుడు శిరస్సుతో అంజలి ఘటించి,
మధురమైన మాటలతో సీతమ్మతో సంభాషణ మొదలెడతాడు.

"పద్మరేకులవంటి కళ్ళు కలదానా,
నలిగిన పట్టువస్త్రములు ధరించినదానా,
దోషములు లేని దానా,
చెట్టుకొమ్మని పట్టుకొని నిలబడిన దానా,
నీవు ఎవరివి?

తామరాకులనుంచి నీరు జారినట్లు,
నీ నేత్రములనుంచి ఎందుకు కనీళ్ళు జారుతున్నాయి?
ఓ మంగళరూపిణీ నీవు సురలలో ఒకరివా ?
అసురలలోగాని నాగులు గంధర్వులు రాక్షసులు లేక కిన్నరులలోగాని ఒకరివా ?
రుద్రగణములకు కాని మరుత్ గణములకు కాని వసువులకుగాని చెందిన దానవా ?
వీరిలో నీవు ఎవరివి? "

అన్నీతెలిసిన హనుమ ఇంకా అడుగుతాడు.

" ఓ వరాననా అందమైన అవయవములు కలదానా
నీవు తప్పక దేవతలవలే శోభిస్తున్నావు.
చంద్రుని వదలి ఆకాశమునుంచి పడిన నక్షత్రములలో శ్రేష్ఠమైన ,
శ్రేష్ఠమైన గుణములు కల రోహిణివా నువ్వు?
ఓ కల్యాణీ దోషములేని నేత్రములు కలదానా ఎవరివి నీవు?
కోపముతో కాని మోహముతో కాని భర్త అయిన వశిష్ఠుని వదిలి వచ్చిన అరుంధతివా ?
ఓ సుమధ్యమా ! నీ పుత్రులు, తండ్రి, భర్త, సోదరులలో
ఎవరు ఈ లోకమునుంచి పరలోకమునకు పోవుటవలన నువ్వు దుఃఖములో ఉన్నావు?
నీ రోదనములోని ఉఛ్వాస నిఃశ్వాసములతో,
భూమి మీద నిలబడడములో కల రాజలక్షణములతో
నీవు దేవతవు కావు అని అనుకుంటున్నాను'.

'నీ మీదయున్న లక్షణములతో నువ్వు రాజ మహిషి అగు రాజ కన్యవు అని భావిసున్నాను.
నీవు జనస్థానమునుండి రావణుని చేత బలాత్కారముగా అపహరింపబడిన
సీత అయినచో అది నాకు చెప్పుము.
నీకు శుభము అగు గాక.
నీ లోని దైన్యము, అతిమానుషరూపము,
అలాగే తపస్విని వేషము చూచి నువ్వు తప్పక రామ మహిషి వే !"

ఇందులో హనుమంతుని వాక్చాతుర్యము గమనింపతగినది.
త్రిజటా స్వప్నము విన్న,
రావణ సీతమ్మల సంవాదము విన్న,
వేసుకున్న ఆభరణములతో ఈమె సీతయే అని నిర్ధారించుకున్న హనుమకి,
తను సంబోధిస్తున్న స్త్రీ, రాముని పత్ని సీతమ్మయే అని తెలుసు.

కాని వెంటనే "నీవు సీతవా" అని అడగకుండా,
అమె స్థితిని ముందుగా గౌరవపూరకముగా వర్ణిస్తూ,
చివరికి రావణుడు ఎత్తుకు పోయిన రామ మహిషివా అని అడుగుతాడు.
హనుమంతుని వాక్చాతుర్యముతో నమ్మకము కలిగిన సీత,
అప్పుడు తన కథ అంతా వివరముగా చెప్పుతుంది.

"నేను భూమండలములో రాజసింహులలో ముఖ్యులైన ,
ఆత్మను ఎరిగిన, శత్రు సైన్యములను రూపుమాపిన, దశరథుని కోడలిని.
నేను మహాత్ముడైన విదేహమహరాజు అగు జనకుని పుత్రికను.
ధీమంతుడైన రాముని భార్యను.
సీత అని పేరుగలదానిని."

సీత తనను గురించి తాను చెప్పుకోవడములో
ఆ కాలరీతికి అనుసరిస్తూ ముందు తన మామ గారిపేరు చెప్పి,
వారి ప్రతిభను చాటి , అట్టివారి కోడలిని అని చెపుతుంది.
తరువాత తన వంశము యొక్క పేరుకూడా నిలబెడుతూ,
సాటిలేని తన తండ్రి పేరు చెప్పి,
తను విదేహమహరాజు కూతురుని అని కూడా చెపుతుంది.
పెద్దవారిని గురించి చెప్పి అప్పుడు తను "భార్యా రామస్య ధీమతః",
అంటే ధీమంతుడైన రాముని భార్యను అని చెపుతుంది.

అలాగ చెప్పే రీతిలో అప్పటి సాంప్రదాయము కనిపిస్తుంది.

దశరథమహరాజు గారి గురించి చెప్పిన మాటలలో -
అంటే 'తను శతృ సైన్యములను రూపు మాపిన దశరథుని కోడలిని' -
అన్నమాటలో అయనే వుంటే నేను ఈ స్థితిలో వుండే దానిని కాదు అనే మాట స్ఫురిస్తుంది.
అలా స్ఫురించినా ఆయన దివంగతులు.
అది ఆయనపై గౌరవపూర్వకముగా చెప్పిన మాట.
"భార్యా రామస్య ధీమతః" అని చెప్పిన మాటలో,
సీతమ్మకి తన భర్తపై కల దృఢ నమ్మకము కనిపిస్తుంది.

ఈ మాట , అంటే "భార్యా రామస్య ధీమతః" అనేమాట,
ఇంతక ముందు రాక్షస స్త్రీలకు సీతమ్మ చెప్పిన మాటతో ధ్వనిస్తుంది.
ఆ మాట " దీనో వా రాజ్య హీనోవా యోమే భర్తా స మే గురుః".
ఈ రెండు మాటలు ఒకదానికి ఒకటి అనుగుణము గా వుంటాయి.
ఈ రెండు మాటలూ కూడా సీత కు భర్తపై నున్న ధృఢ నమ్మకమును ప్రకటిస్తాయి.

ఇక్కడ అధ్యాత్మికముగా చూస్తే ఒక మాట చూడ తగినది అంటారు అప్పలాచార్యులు గారు.

ఎవరైనా తమను గురించి చెప్పుకుంటే
శరీర సంబంధముకన్నా ఆత్మ సంబంధమును చెప్పుకొనవలెను.

తండ్రి అయిన జనకుని "వైదేహస్య మహాత్మనః" అని వర్ణించినా ,
తన భర్త కు తండ్రి అయిన దశరథుడు గురుతుల్యుడు.
గురువే ఆత్మ జ్ఞానము ప్రసాదించువాడు.
అట్టి గురువు గురించి ముందు చెప్పాలి.
తరువాత శరీరము నొసగిన తండ్రి గురించి చెప్పాలి.
ఆ తరువాత ఆత్మ స్వరూపము గురించి చెప్పాలి.

సీత కూడా అదే సూత్రము పాటించింది.
ముందు దశరథుని గురించి,
తరువాత తండ్రి గురించి,
ఆ తరువాత తన స్వరూపము గురించి - భార్యా రామస్య దీమతః" అంటూ.

తన గురించి చెప్పిన తరువాత - హనుమంతునిపై కలిగిన నమ్మకముతో,
తన కథ కూడా పూర్తిగా చెప్పుతుంది.

"నేను ఆ రాఘవుని నివాసములో మానుష భోగములను అనుభవిస్తూ
అన్ని సదుపాయములతో పన్నెండు సంవత్సరములు గడిపితిని.
అప్పుడు పదమూడవ సంవత్సరములో,
రాజ గురువులతో కలిసి ఆ మహారాజు
ఇక్ష్వాకు నందనుడగు రాముని పట్టాభిషేకమునకు నిర్ణయించెను.
ఆ రాఘవుని పట్టాభిషేకమునకు జరుగుతున్న సంరంభమములలో,
కైకేయి అనబడు దేవి తన భర్తతో ( దశరథునితో) ఇట్లు పలికెను.
" రాముని అభిషేకముతో నేను ఎమీ తాగను ,
ప్రతిరోజూ భోజనము చేయను.
ఇది నా జీవితమునకు అంతము.
ఓ నృపసత్తమా నీవు ప్రేమతో ఏ మాటలు చెప్పితివో
ఆ మాటలు వృధాకాకుండా వుండాలి అంటే,
రాఘవుడు వనము నకు పోవును" అని.
సత్యవంతుడైనా ఆ రాజు కైకేయికి ఇచ్చిన వరదానమును స్మరించి,
ఆ దేవి యొక్క అప్రియమైన మాటలు విని మూర్ఛపోయెను.

అప్పుడు సత్య ధర్మములో అనుష్ఠితుడైన దశరథమహారాజు,
విలపించుచూ జ్యేష్ఠపుత్రుని రాజ్యము గురించి కోరెను.
ఆ శ్రీమంతుడు అభిషేకము కన్న పిత్రువచన పరిపాలన ముఖ్యము అని మనసా తలిచి
తన వాక్కుతో అంగీకరించెను.
సత్యమే పరాక్రమముగా గల ఆ రాముడు ఎప్పుడూ ఇచ్చెడి వాడు.
మరల తీసుకొనువాడు కాదు.
ప్రాణసంకటములో కూడా అప్రియమైన మాటలు చెప్పువాడు కాడు.
మహాయశోవంతుడైన ఆ రాముడు మహత్తరమైన ఉత్తరీయములను వదిలి
మనసా రాజ్యము వదిలి నన్ను తన జననికి అప్పగించెను.
నేను ఆయనికి ముందే వనచారిణి గా సిద్ధము అయితిని.
ఆయన లేకుండా నాకు స్వర్గము కూడా ఇష్ఠము లేదు.
మహాభాగుడు మిత్రనందనుడు అగు సౌమిత్రి కూడా
పూర్వజుని అనుసరించుటకు నారచీరలతో అలంకరించుకొనెను".

సీతమ్మ చెప్పిన ఈ మాటలలో రాముని స్వభావము,
ఆ రాముని స్వభావముపై సీత యొక్క అభిమానము కనిపిస్తాయి.
ఆ స్వభావములో "పితృవాక్య పరిపాలన" ముఖ్యము.
పట్టాభిషేకముకన్నా - పితృవాక్య పరిపాలనే ముఖ్యముగా భావించిన వాడు రాముడు.

ఇంకొక మాట.
ఇక్కడ సత్య ధర్మములో అనుష్టితుడైన దశరథ మహారాజు,
ఇచ్చిన మాటను కాదు అనని దశరథ మహారాజు,
అలాగే " సత్య పరాక్రమః" అని వర్ణింపబడిన రాముడు గమనించ తగినివారు.

ఇక్కడ రాముని స్వభావము గురించి సీత చెప్పిన మాట వినతగినది.

"దద్యాన్ నప్రతిగృహ్ణీయాత్
న బ్రూయాత్ కించిదప్రియం|
అపి జీవిత హేతోర్వా
రామః సత్యపరాక్రమః"||

రాముడు ఇంకొకరికి "దద్యాన్" ఇస్తాడే కాని ,
"నప్రతిగృహ్ణీయాత్" తను తీసుకోడు.
"అప్రియం" అయిన మాట "న బ్రూయాత్" చెప్పడు.
ఎప్పుడూ అప్రియము చెప్పడు.
"అపి జీవిత హేతోః వా" - అంటే చచ్చినా అప్రియమైన మాట చెప్పడు.!

రాముడు "సత్య పరాక్రమః".
సత్యపరాక్రమః అంటే
(1) సత్యమైన పరాక్రమము కలవాడు
(2) సత్యమే పరాక్రమముగా కలవాడు
(3) సత్యముచే పరలోకములను ఆక్రమించువాడు.
ఈ మూడు కూడా రామునికి తగిన వర్ణనలే.

సీత చివరి మాట:

" మేము అందరము రాజ ఆదేశమును శిరసావహించి
ధృడమైన వ్రతముతో ఎప్పుడూ చూడబడని గంభీరమైన ఆ వనమును ప్రవేశించితిమి.
అమితతేజస్సు కల ఆయన భార్యను అయిన నేను దండకారణ్యములో నివశించుచుండిని.
దురాత్ముడైన రాక్షసుడు రావణుని చేత అపహరించబడితిని.
వానిచేత రెండు నెలల కాలము జీవితము గడువు పెట్టబడెను.
ఆ రెండు నెలల తరువాత జీవితము త్యజించెదను".

ఆఖరిమాటలో
" తతః తక్ష్యామి జీవితం" ,
అంటే ఇంకారెండు నెలలు దాటితే జీవితమునే త్యజించెదను అని చెపుతూ,
సీతమ్మ తన స్థితిని ఒక్క మాటలో వెళ్ళడిస్తుంది.

ఇదే మనము సుందరకాండలో ముప్పది మూడవ సర్గ లో వినేది.

|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||